నేను శక్కర్ నగర్ కు వచ్చిన కొత్తలో అక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. సహచర లెక్చరర్ లు, వారి భార్యలు, మా పొరుగు...
Read More
నేను శక్కర్ నగర్ కు వచ్చిన కొత్తలో అక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. సహచర లెక్చరర్ లు, వారి భార్యలు, మా పొరుగున ఉన్న ఫ్యాక్టరీ అధికారులు, వారి సతీ మణులు అందరూ చక్కగా, సరదాగా మాట్లాడుతూ స్నేహ పూర్వకంగా ఉండేవారు.
తరచుగా ఇక్కడ అందరూ కలుస్తారనీ, pot luck dinner లు ఏర్పాటు చేసుకుంటారనీ, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్వత్ సభలు కూడా జరుగుతాయనీ చెబితే విని చాలా సంతోషం కలిగింది.
అలాంటి ఒక సభ గురించే ఇప్పుడు చెబుతున్న.
వివాహం అయి మూడు, నాలుగు ఏండ్లు అయిన గృహిణులను అందరినీ, ఓ మహిళా దినోత్సవం నాడు ఒక దిన పత్రిక వారు ( ' కేకలు ' అనుకుంట ) సభ ఏర్పాటు చేసి పిలిచారు. నాకు ఇలాంటి సభలకు పోవడం, ఎప్పుడూ ఇష్టం లేకుండే. నేను చక్కటి తెలుగు భాష మాట్లాడతానని, కంఠం కూడా బాగానే ఉంటుందని, నేను మాట్లాడితే దాని ప్రభావం సభలో పాల్గొనే వారందరిపైన ఉంటుందని ఎవరో NSF అధికారుల్లో ముఖ్యు లు ఆ పత్రిక వారికీ చెప్పారట.
( అట్లా అని నాకు 3,4 నెలల తర్వాత గాని తెలియరాలేదు. )
అందుకని నన్ను కూడా ఆహ్వానించారు.
మా వారికి చెబితే , దానికేముంది మంచిగా మాట్లాడతావు కనుక పిలిచి ఉంటారు. వెళ్లి నీకు నచ్చింది, తోచింది మాట్లాడి రావచ్చుగదా అన్నారు.
" అదేంటండి, అట్లా అంటారు. నేను ఇట్లాంటి సభలకెప్పుడు వెళ్ళలేదు, మా నాన్న గారు చాలా strict. ఆడవాళ్ళను బయటికే వెళ్ళనీయరు ఇంక దానికి తోడు ఉపన్యాసం ఇచ్చుడా ? Never it happens" అన్న.
పక్కనే ఉన్న NSF ఆఫీసర్ భార్య " అదేంటమ్మా ? అలా అంటావు ? నీకో అవకాశం వచ్చింది అత్తయ్య గురించి చెప్పడానికి. వెళ్ళు. వెళ్లి అదే చెప్పు. రెండు నిముషాలు మాట్లాడి రా" అని నచ్చ చెబితే ధైర్యం చేసి వెళ్ళి నాను.
మధు మాలాంచ డిగ్రీ కాలేజీ ఆవరణలో ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదురుగ ఉన్న గదిలోనే సభ ఏర్పాటు చేసారు.
మా నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా ? అత్తగారింటికి పోయినాక ఇట్లాంటి పిచ్చి వేషాలు కూడా వేస్తున్నావా ? అని అంటాడేమోనన్న భయం తోనే సభలో కూర్చున్న.
స్టేజి పైకి ఒకరి తరువాత ఒకరిని పిలుచుకుంటూ పోవడం తో సభ ప్రారంభ మైంది. నేను ఇట్లాంటి సభలో పాల్గొనడమే ఓ విచిత్రం అనుకున్నా. కాని నన్ను కూడా స్టేజి మీదకు ఆహ్వానించగానే, నాకైతే తల కాయ తీసేసినo త పని అయింది.
నేనేంటి , ఇక్కడ ఇంత మందిలో నేను స్టేజి మీదకు పోవడమేంటి ? అంతా అగమ్య గోచరంగా ఉండింది.
సరే . తప్పేటట్టు లేదు. నేనేం తప్పు చేసినా మా వారికి చెడ్డ పేరు వస్తదని, సారు భార్య ఇట్లా చేసింది, అట్లా చేసిందని అనుకుంటారని క్రమ శిక్షణ తో బుద్దిగా కూర్చున్న.
ఉపన్యాసాలు మొదలైనవి.
మొదటి అమ్మాయి వచ్చి, తన భర్త తనను ఎంతో మంచిగా చూసుకుంటాడని చెపుతూ, తన అత్త మాత్రం ఏక్ దం రాక్షసి అని, తనను ఎదిరిoచడం తన వల్ల అవడం లేదనీ, సినిమా ల్లో సూర్యకాంతం ను ఎవరైనా ఎదిరించారా ? అంతే. తన పరిస్థితి కూడా అదే. ఇంటిలో ఉన్న అందరికీ చాకిరీ చేయడం తన వల్ల కాదనీ దాదాపు మొర పెట్టుకున్నంత పని చేసింది. తన అమ్మ, ఇంత పనిని భార్య తో చేయించుకుంటున్నా, తన భర్త వాళ్ళ అమ్మను మాత్రం పల్లెత్తు మాట కూడా అనడు. తననే సరుదుకు పొమ్మంటాడు. ఇట్లాంటివన్నీ చెబుతూ అత్త యొక్క క్రూరత్వాన్ని బయట పెట్టి తన ధాటి ని ముగించింది.
ఇక రెండో అమ్మాయి తన అత్తతో ఉన్న కష్టాలు, గోడు అంతా వెళ్ళబుచ్చింది. అత్తనే కాదు, ఈ అమ్మాయి భర్త కూడా వేధించడంలో దిట్ట అనీ, అత్త ముసలావిడ కాకున్నా కాళ్ళు ఒత్తించుకుంటది, స్నానం పోయించుకుంటది, ఇదేం పోయే కాలమో, ఒళ్ళు గట్టిగానే ఉన్నా తన తో ఎందుకు చేయించుకుంటదో, అది ఎప్పుడు చచ్చి పోతదో అని ఎదిరి చూద్దామంటే, ఇంకో ఇరవై ఏండ్లు బతికేతట్టే ఉన్నది అనుకుంటూ, అత్త మీద శాపనార్థాలు పెట్టుకుంటూ ముగించింది తన అత్త పోరు గురించిన ఉపన్యాసం.
ఇట్లా ఈ అమ్మాయిలు చెప్పుకుంటూ పోతుంటే,
" అబ్బా ! చూసారా ఎంత పొగరు బోతు అత్తలో, ఇట్లాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాలే " అనీ మధ్య మధ్యలో ఒకరిద్దరు తమ తమ అక్కసు పక్క వాళ్ళతో వెళ్ళ బోసుకున్నారు.
మరో అమ్మాయి ఉపన్యాసం అయినాక నా వంతు వచ్చింది.
ఇదేంటి ? నా కంటే ముందు మాట్లాడిన వారు తమ తమ అత్తయ్యల ను గయ్యాళి గానే వివరించారు.
అంతే కాబోలు. వాళ్ళ అత్తయ్య లు అలాగే ఉన్నారేమో ? అనుకుంటూ లేచి మైక్ ముందుకు వెళుతుంటే
" రాధ గారు మీరు భయ పడ కుండా, నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి" అని, అధ్యక్షురాలు నన్ను చూసుకుంటూ అన్నది.
నేను లేచి గొంతు సవరించుకుని, చక్కని సంబోధన తర్వాత అసలు ఉపన్యాసం మొదలు పెట్టిన.
" మా అత్తయ్య కు వినమ్రపూర్వక నమస్కారాలు. పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నానను కుంటా, మా అత్తయ్య లాంటి మంచి మనిషి నాకు దొరకడం నా సౌభాగ్యమే అని తలుస్తాను". నా భాషణం ప్రారంభించాను.
ఆ హాల్ అంతా కొంత విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది.
ఈవిడెంటి ఇలాంటి మాటలతో మొదలు పెట్టింది? మొదలు ఉత్తమంగా ప్రారంభించి, తర్వాత అదంతా ఉత్తదేనని అంటుంది కాబోలు అని కొంత మంది అనుకున్నారట.
" పెళ్ళి అయి అత్తగారింటికి రాగానే మరుసటి రోజునే వంటింట్లోకి వెళ్లి మూడు నాలుగు కట్టెలు పొయ్యిలో పెట్టిన. ( మా వారింట్లో కట్టెల పొయ్యి మీదనే వంటంతా. నాకు ఆ కట్టెలు మండాలంటే ఎట్లా పొయ్యి ముట్టియ్యాలో తెలువదు). అవీ ఎట్లా మండుతాయో నాకు తెల్వక దిక్కులు చూస్తుంటే, మా అత్త గారు వచ్చి " బిడ్డా ! నీకు ఈ కట్టెల పొయ్యి విషయాలు తెలువదే, నువ్వు ఈ వంటింట్లోకి అసలు రాకు.
బడికి పోయే పిల్లలకు అన్నం అన్నం వడ్డించడంలో నీకు తోచిన సహాయం చేద్దూ గానీ," అని నాతో ఏ పని చేయించలే.
మా అత్తయ్య చాయ్ లు పెడితే అందరికి అందించడం, బంధువులు ఎవరైనా వస్తే నమస్కారం పెట్టి, వారికి నీళ్ళివ్వడం మాత్రమే నేను చేసే పని అని వివరిస్తుంటే,
" అంతగా అత్తగారిని పొగడక్కర లేదండీ " అని ఎవరో వెనుకనుండి మెల్లిగా అనడం వినిపించింది.
ఇంట్లో ఎంతో పని ఉన్నా, " ఈ ఇంటి పనులు ఎప్పుడూ ఎడ తెగవు గానీ , మీరిద్దరూ ఏదైనా ఓ సినిమా కు పోయి రండే" అంటూ మమ్ములను సినిమా కు బయలు దేరే వరకు విడువలేదనుకోండి. ఇట్లాంటివే ఇంకా రెండు, మూడు విషయాలు అత్తయ్య తన కోడలును ఎంత బాగా చూసుకుంటుందో వివరంగా చెప్పగలిగిన..
తర్వాత తెలిసింది ఆ పత్రికల వారు, " ఎవడ్రా ఈవిడను పిలిచింది, మన ప్రోగ్రాం అంతా ఖరాబ్ అయింది ఈవిడ ఉపన్యాసం వల్లే " అని గద్దీoచి అరిచారట.
" మా అత్తయ్య లాంటి వాళ్ళు అందరూ ఆడ పిల్లలకు దొరకాలనీ అందరూ అత్తా కోడళ్ళు స్నేహితుళ్ళ లాగానే ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను" అని మా అత్తయ్య తో నా కున్న గౌరవం, మర్యాద, సాన్నిహిత్యం గురించి తెలిపి నా ఉపన్యాసం ముగించిన. .
ఒకరిద్దరు మాత్రమే చప్పట్లు కొట్టడం విన్నా.
ఆ తరువాత జరిగిన స్నాక్స్ time లో ఆ పత్రికల వారు " మీరిలా అత్తల వైపే మాట్లాడతారనుకుంటే మిమ్మల్ని పిలవకనే పోదుం madam " అనడం కొస మెరుపు.
...
Show Less